: రోజుకో రకంగా మారుతున్న అంచనాలు... 1 నుంచి 3.1 శాతం ఆధిక్యంలోకి హిల్లరీ


ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఉత్కంఠను రేపుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఘట్టం తుది దశకు చేరిన వేళ, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రోజుకో రకంగా మారుతున్నాయి. మరో 7 రోజుల్లో ఎన్నికలు జరగనుండగా, తాజాగా వెల్లడైన అంచనాల్లో డొనాల్డ్ ట్రంప్ కన్నా హిల్లరీ క్లింటన్ 3.1 శాతం ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. 'రియల్ క్లియర్ పాలిటిక్స్' నిర్వహించిన సర్వేలో ఆమె విజయం ఖాయమని వెల్లడైంది. రెండు రోజుల క్రితం ఐబీడీ / టీఐపీపీ సర్వే ఫలితాలు వెల్లడి కాగా, ట్రంప్ కు, హిల్లరీకి మధ్య ఒక్క శాతం మాత్రమే ఓట్ల తేడా ఉన్నట్టు వెల్లడైన సంగతి విదితమే. క్లింటన్ కు మద్దతుగా 45 శాతం మంది, ట్రంప్ కు మద్దతుగా 44 శాతం మంది ఉన్నట్టు ఐబీడీ / టీఐపీపీ ప్రకటించింది. ఇక బింగ్ పొలిటికల్ అంచనాల ప్రకారం హిల్లరీకి 82 శాతం వరకూ గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పొలిటికో, మార్నింగ్ కన్సల్ట్ అంచనాల ప్రకారం ట్రంప్ కు 39 శాతం మంది హిల్లరీకి 42 శాతం మంది ఓట్లు వేస్తారని వెల్లడైంది. ఈ-మెయిల్ కుంభకోణంపై విచారణను తిరిగి ప్రారంభిస్తున్నట్టు గతవారం చివర్లో ఎఫ్బీఐ ప్రకటించినప్పటికీ, అది పోలింగ్ పై చూపే ప్రభావం స్వల్పమేనని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News