: మధురైలో మార్నింగ్ వాక్ చేసి, కాఫీ హోటల్ కస్టమర్లందరి బిల్లూ చెల్లించిన స్టాలిన్
తమిళనాడులోని తిరుప్పరంకుడ్రం నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్న వేళ, డీఎంకే అభ్యర్థి డాక్టర్ శరవణన్ తరఫున ప్రచారం చేసేందుకు వచ్చిన విపక్ష నేత స్టాలిన్ ప్రజలను ఆశ్చర్యపరిచారు. తానెక్కడున్నా నిత్యమూ మార్నింగ్ వాక్ చేసే అలవాటున్న ఆయన, మధుర మీనాక్షీ అమ్మవారి ఆలయం చుట్టూ జనసమ్మర్థంతో ఉండే చిత్తిరై వీధుల్లో వాకింగ్ చేశారు. ఒళ్లంతా చెమటలు కారే వరకూ నడిచిన ఆయన, గోపు అయ్యంగార్ హోటల్ కు చేరుకుని వేడి వేడి కాఫీ తాగి, ఆ సమయంలో అక్కడే కాఫీ తాగుతున్న అందరి బిల్లులనూ కూడా చెల్లించారు. సాధారణంగా మధురై వచ్చినప్పుడు రేస్ కోర్స్ రోడ్డు, వాకర్స్ క్లబ్ ప్రాంతంలో ఉదయపు వ్యాహ్యాళికి వెళ్లే ఆయన, చిత్తిరై వీధుల్లోకి రావడంతో ఆయన్ను చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున ఆసక్తి చూపారు. పలువురు యువతీ యువకులు స్టాలిన్ తో కలచాలనం చేస్తూ సెల్ఫీలు దిగారు.