: హెడ్ కానిస్టేబుల్ పాడెను మోసిన ముఖ్యమంత్రి
భోపాల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకునే క్రమంలో డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమాశంకర్ యాదవ్ ను సిమీ ఉగ్రవాదులు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం ఆయన భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు నిర్వహించిన అంతిమయాత్రలో వేలాది మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా హాజరయ్యారు. రమాశంకర్ కు నివాళి అర్పించి, అతని కుటుంబసభ్యులను ఓదార్చారు. అంతేకాదు, రమాశంకర్ పాడెను మోసి, అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ఉగ్రవాదులతో పోరాడి రమాశంకర్ ప్రాణత్యాగం చేశారని కొనియాడారు. అతని కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం అందిస్తామని... అతని కుమార్తె వివాహానికి రూ. 5 లక్షల ఆర్థికసాయం చేస్తామని తెలిపారు. దీనికి తోడు, రమాశంకర్ నివసిస్తున్న కాలనీకి అతని పేరు పెడతామని చెప్పారు. సిమీ ఉగ్రవాదుల ఎన్ కౌంటర్ పై కొందరు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని... ఇలాంటి సున్నితమైన అంశాలను రాజకీయాలకు వాడుకోవడం సరికాదని అన్నారు.