: జైలు నుంచి పారిపోయిన సిమీ ఉగ్రవాదులకు జీన్స్ ప్యాంట్స్, షూస్ ఎక్కడ నుంచి వచ్చాయ్?


నిన్న ఉదయం భోపాల్ సెంట్రల్ జైలు నుంచి పరారైన ఎనిమిది మంది సిమీ ఉగ్రవాదులు... కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసుల చేతిలో ఎన్ కౌంటర్ అయ్యారు. అయితే, ఈ ఎన్ కౌంటర్ పై పలు అనుమానాలు నెలకొన్నాయి. ఉగ్రవాదులు తమపై కాల్పులకు తెగబడ్డారని... దీంతో, తాము కూడా కాల్పులు జరపాల్సి వచ్చిందని ఓ వైపు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు, ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని, ఉగ్రవాదులను పట్టుకోవడానికి అవకాశం ఉన్నా వారిని కాల్చి చంపారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్ కౌంటర్ కు సంబంధించి పోలీసులు చెబుతున్న సమాచారంలో కూడా స్పష్టత లేకపోవడంతో... ఈ ఘటనపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. హతమైన సమయంలో సిమీ ఉగ్రవాదులు జీన్స్ ప్యాంట్స్, షూస్ వేసుకుని ఉన్నారు. అండర్ ట్రయల్ ఖైదీలుగా ఉన్న వీరు ఈ దుస్తులను ఎలా ధరించారో తెలియదు. జైలు నుంచి పరారైన తర్వాత వీటిని ధరించారా? లేక జైలు నుంచే ఈ దుస్తులతో బయటకు వచ్చారా? అనే విషయంలో క్లారిటీ లేదు. ఉగ్రవాదుల ఆచూకీకి సంబంధించిన సమాచారం అందిన తర్వాత, వారిని పట్టుకోవడానికి తాము వెళ్లామని... వెంటనే తమ వద్ద ఉన్న తుపాకులతో వారు తమపై కాల్పులు జరిపారని... దీంతో, తాము కూడా ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. జైలు నుంచి పరారై, బయటకు రాగానే వారికి ఆయుధాలు ఎలా సమకూరాయనే విషయంలో కూడా క్లారిటీ లేదు. ఉగ్రవాదుల గురించి గ్రామస్తులు సమాచారం ఇచ్చారని భోపాల్ ఐజీ యోగేష్ చౌదరి ఓవైపు చెబుతుండగా... ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలో కనీసం జన సంచారం కూడా లేదని కొందరు వాదిస్తున్నారు. ఏ రకంగా చూసినా పలు సందేహాలకు తావుండటంతో... ఎన్ కౌంటర్ పై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ ఘటనపై దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి అప్పగించారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.

  • Loading...

More Telugu News