: బ్రెగ్జిట్ ఎఫెక్ట్... తన ఉత్పత్తుల ధరలను భారీగా పెంచిన 'యాపిల్'
బ్రెగ్జిట్ (యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు రావడం) ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. దాని ప్రభావం మన దేశంలో కూడా కనిపిస్తోంది. ప్రముఖ సంస్థ యాపిల్ తన ఉత్పత్తుల ధరలను భారీగా పెంచుతున్నట్టు ప్రకటించింది. భారత్ లో కూడా తన మ్యాక్ బుక్ ధరలను అమాంతం పెంచేసింది. ఏకంగా రూ. 10 వేల మేర ధరలను పెంచింది. ఇప్పటికే యాపిల్ వెబ్ సైట్ లో కొత్త ధరలను అప్ డేట్ చేసింది ఆ సంస్థ. దీంతో, 12 అంగుళాల మ్యాక్ బుక్ ధర రూ. 6000 పెరిగి ప్రస్తుతం రూ. 1,12,900కు చేరింది. అలాగే ఫాస్టర్ ప్రాసెసర్, డబుల్ ఎస్ఎస్డీ స్టోరేజ్ ఉన్న మ్యాక్ బుక్ రూ. 10 వేలు పెరిగి రూ. 1,39,900కి చేరుకుంది. యాపిల్ ఆఫర్ చేస్తున్న వాటిలో మ్యాక్ బుక్కే చిన్న ల్యాప్ టాప్. అయితే ఇతర ల్యాప్ టాప్స్, డెస్క్ టాప్స్ ధరలను మాత్రం యాపిల్ సంస్థ మార్చలేదు. బ్రెగ్జట్ కారణంగానే తాము ధరలను పెంచినట్టు ఆ సంస్థ ప్రకటించింది. పన్నులు, వ్యాపార ఖర్చులు, కరెన్సీ ఎక్స్ ఛేంజ్ రేట్స్, స్థానిక దిగుమతి చట్టాలు వంటి ప్రభావంతో ధరలను పెంచక తప్పడం లేదని కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే, అమెరికా రీటెయిల్ మార్కెట్లో మాత్రం ధరలు యథాతథంగా ఉన్నాయి.