: 'వాడు బతికేవున్నాడు, కాల్చేసెయ్' భోపాల్ ఎన్ కౌంటర్ వీడియో సంచలనం... పోలీసుల వైఖరిపై ప్రశ్నలెన్నో!
భోపాల్ కేంద్ర కారాగారం నుంచి తప్పించుకున్న సిమీ ఉగ్రవాదులను పోలీసులు ఎన్ కౌంటర్ లో కాల్చిచంపగా, ఇప్పుడు పోలీసుల వైఖరిపై పలు ప్రశ్నలు వస్తున్నాయి. ఎన్ కౌంటర్ కు సంబంధించిన వీడియోలు బయటకు రాగా 'జిందా హై, మారో' (వాడు బతికేవున్నాడు, కాల్చేసెయ్) అని ఓ పోలీసు పెద్దగా చెప్పడం ఇందులో వినిపిస్తోంది. "వాడి గుండెల్లోకి ఓ బులెట్ కొట్టు" అని మరో గొంతు కూడా వినిపిస్తోంది. మరో పోలీసు అచేతనంగా పడివున్న మృతదేహంపై కాల్చుతున్నట్టు ఉంది. ఇంకో వీడియోలో నిందితులు పోలీసులకు లొంగిపోవాలన్న ఉద్దేశంతో ఉన్న పరిస్థితుల్లో పోలీసులు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. దీనిలో "కాస్తాగండి!... ఈ ఐదుగురూ మనతో మాట్లాడాలని అనుకుంటున్నారు" అని ఆపై క్షణాల తరువాత "వారు పారిపోయే ప్రయత్నంలో ఉన్నారు. చుట్టుముట్టండి" అని వినిపిస్తోంది. ఆపై తుపాకి చప్పుళ్లు ఇందులో కనిపించాయి. వీరిని ప్రాణాలతో పట్టుకునే అవకాశాలు ఉన్నప్పటికీ పోలీసులు ఆ మార్గాన్ని ఎంచుకోకుండా, చంపేసేందుకే నిర్ణయించుకున్నారన్న విపక్షాల ఆరోపణలకు ఈ వీడియోలు బలం చేకూరుస్తున్నాయి. ఉగ్రవాదులు ఆయుధాలతో ఎదురుతిరిగారని, తప్పనిసరి పరిస్థితుల్లో ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని మధ్యప్రదేశ్ హోం మంత్రి భూపేంద్ర సింగ్ వెల్లడించడం గమనార్హం.