: అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడంటూ భర్తను చంపేసిన భార్య


తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో, కట్టుకున్న భర్తనే హత్య చేసిన ఘటన హైదరాబాదులో జరిగింది. తన ప్రియుడితో కలసి ఆమె ఈ కిరాతానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే, యాదాద్రి జిల్లా మోత్కూరు మండలానికి చెందిన బొంత రాజు (32)కు హైదరాబాదులోని మాణికేశ్వరినగర్ కు చెందిన గంగతో ఏడేళ్ల క్రితం వివాహమయింది. వీరికి ఆరేళ్ల బాబు ఉన్నాడు. భార్యాభర్తలిద్దరూ కాప్రా సూర్యనగర్ కాలనీలో నివసిస్తూ, జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గంగకు తన తమ్ముడి స్నేహితుడు శ్రీనివాస్ తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలిసిన బొంత రాజు, ఇది మంచిది కాదని పలుమార్లు హెచ్చరించాడు. కొన్నిసార్లు కొట్టాడు కూడా. ఈ నేపథ్యంలో, తన సుఖానికి అడ్డువస్తున్నాడన్న కారణంతో, భర్త అడ్డు తొలగించుకోవాలని గంగ ప్లాన్ వేసింది. ఆదివారం రాత్రి మద్యం సేవించి ఇంటికొచ్చిన బొంత రాజు... యథాప్రకారం భార్యతో ఘర్షణ పడ్డాడు. భర్త నిద్రపోయిన తర్వాత తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది గంగ. ఇద్దరూ కలసి రాజు ఛాతిపై బలంగా కొట్టి, గొంతు నులుమి హత్య చేశారు. అనంతరం, రాజు మృతదేహాన్ని చీరతో ఫ్యాన్ కు వేలాడదీసి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. రాజు ఆత్మహత్య చేసుకున్నాడంటూ బంధువులకు, చుట్టుపక్కల వారికి నిన్న ఉదయం గంగ చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి, మృతదేహాన్ని పరిశీలించారు. రాజు శరీరంపై గాయాలు ఉండటంతో, పోలీసులకు అనుమానం వచ్చింది. గంగను అదుపులోకి తీసుకుని, తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఆమె ఇచ్చిన సమాచారంతో శ్రీనివాస్ ను కూడా అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News