: షాపింగ్ మాల్ లోకి ఆటోలకు 'నో ఎంట్రీ'తో గొడవ.. ముంబైలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు వింత అనుభవం!
షాపింగ్ మాల్ లోపలికి ఆటోలను అనుమతించమంటూ ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను అడ్డుకున్న ఘటన ముంబైలో జరిగింది. దీపావళి పండగ సందర్భంగా వికాస్ తివారి అనే 28 సంవత్సరాల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన కుటుంబసభ్యులతో కలిసి ముంబై శివారు ప్రాంతం కురాల్లోని ఫోయెనిక్స్ మార్కెట్ సిటీ మాల్ కు వెళ్లాడు. వికాస్ సోదరుడు సంతోష్ కు ఆటో ఉండటంతో, ఆ ఆటోలోనే వారందరూ వెళ్లారు. షాపింగ్ మాల్ లోకి ఆటో వెళ్తుండగా సెక్యూరిటీ గార్డు పెద్దపెట్టున కేకలు వేస్తూ ఆ ఆటోను అడ్డుకున్నాడు. మాల్ లోపలికి ఆటోలను అనుమతించమని, ఆటోలకు పార్కింగ్ లేదని చెప్పారు. దీంతో, ఆటోలను అనుమతించమనే నిబంధన ఎక్కడ రాసుందని వికాస్ ప్రశ్నించడంతో వారి మధ్య వాగ్వాదం తలెత్తింది. అయితే, ఈ తతంగాన్ని అంతా వికాస్ తన మొబైల్ ద్వారా వీడియో తీశాడు. ఇది గమనించిన సెక్యూరిటీ గార్డులు వీడియో తీయవద్దని అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా, అతనిని సెక్యూరిటీ కాబిన్ లోపలి తీసుకువెళ్లారు. అక్కడ సూపర్ వైజర్ కూడా అదే సమాధానం చెప్పాడు. ఆటోలకు మాల్ లో పార్కింగ్ లేదని చెప్పాడు. దీంతో వీరి మధ్య వాగ్వాదం ముదరడంతో, మాల్ యాజమాన్యం పోలీసులను పిలిపించారు. అయితే, అక్కడికి వచ్చిన పోలీసులు విషయం తెలుసుకుని ఏం చేయాలో తెలియక నవ్వుకున్నారు. స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాల్సిందిగా కోరారు. కాగా, తనతో పాటు తన భార్య, సోదరుడి భార్య, పిల్లలు కూడా ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని వికాస్ చెప్పాడు. అయితే, ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా ముంబై పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు.