: రెచ్చిపోయిన బంగ్లాదేశ్ యువత.. 10 హిందూ దేవాలయాలను, 200 మంది హిందువుల ఇళ్లను ధ్వంసం చేసిన వైనం
మక్కాలోని పవిత్ర కబ్బాను అవమానిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని ఆరోపిస్తూ బంగ్లాదేశ్‌లోని యువత రెచ్చిపోయి, హిందూ దేవాలయాలపై విరుచుకుపడ్డారు. సోషల్‌మీడియాలో ఆ పోస్టును పెట్టిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలని నినాదాలు చేస్తూ ఢాకాలోని నసీర్‌నగర్‌లో 150 మంది యువకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దేవాలయాల్లో హిందూ దేవుళ్ల విగ్రహాలను తీసివేస్తూ, ఆలయాలను ధ్వంసం చేశారు. హిందువులకు సంబంధించిన దుకాణాలపై కూడా దాడులు జరిపారు. వారి చర్యతో అక్కడి హిందువులు భయం గుప్పిట బతికారు. ఇంట్లో నుంచి బయటకు రావడానికి భయపడ్డారు. మొత్తం 10 హిందూ దేవాలయాలను, 200 మంది హిందువుల ఇళ్లపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేశారు. వారికి సంబంధించిన ఎనిమిది దుకాణాలకు నిప్పు పెట్టి రెచ్చిపోయారు. ఈ దాడిలో అక్కడి 150 మంది హిందువులకు గాయాలయినట్లు తెలుస్తోంది. కాగా, ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్టు పెట్టాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న 30 ఏళ్ల వ్యక్తిని తాము అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.