: తొలిసారిగా జె-20 స్టెల్త్ ఫైటర్ జెట్ సత్తాను ప్రజలకు చూపనున్న చైనా
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చైనా తయారు చేసుకున్న జె-20 స్టెల్త్ ఫైటర్ జెట్ విమానాలను తొలిసారి ప్రజల ముందు ప్రదర్శనకు రానుంది. జుహాయ్ ఎయిర్ షోలో భాగంగా లాంగ్ రేంజ్ మిసైల్స్ ను ప్రయోగించే సామర్థ్యమున్న ఈ విమానాల విన్యాసాలు ప్రదర్శించనున్నట్టు చైనా తెలిపింది.ఈ విమానాల విన్యాసాలను తిలకించేందుకు చైనీయులతో వివిధ దేశాలు ఆసక్తిగా ఉన్నట్టు చైనా ఏరోస్పేస్ సంస్థ ఓవీఐసీ ప్రతినిధి టాన్ రూయ్ సాంగ్ వెల్లడించారు. 20 సంవత్సరాల క్రితం ఏరోస్పేస్ టెక్నాలజీ విషయంలో ప్రపంచంలోని చాలా దేశాలతో పోలిస్తే వెనుకబడి వున్న చైనా, ఇప్పుడు ఎన్నో దేశాల కన్నా ముందు నిలిచిందని ఆయన అన్నారు. చైనా వైమానిక శక్తిని ఈ విమానం మరో ఎత్తునకు తీసుకువెళుతుందని తెలిపారు. విమానాల ఆధునికీకరణ చైనాలో వేగవంతంగా సాగుతోందని, ఎన్నో పొరుగు దేశాలతో వివాదాలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఈ తరహా విమానాల అవసరం తమ దేశానికి ఎంతో ఉందని ఆయన అన్నారు.