: ఉగ్రవాద సంస్థ సిమీ గురించిన ఆసక్తికర అంశాలు!
భోపాల్ జైలు నుంచి ఎనిమిది మంది ఉగ్రవాదులు పారిపోగా, వారిని గంటల వ్యవధిలోనే పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంతో సిమీ (స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా) పేరు మరోసారి తెరపైకి వచ్చింది. హతులైన ఎనిమిది మందీ సిమీకి చెందిన వారే. వీరంతా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పలు నేరాలకు పాల్పడిన వారే. ఈ ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఉగ్రవాద సంస్థ సిమీ గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం... * సిమీ ఇప్పటికీ తన కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉంది. 1967 నాటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణా చట్టం కింద నిషేధాన్ని ఎదుర్కొంటూ రహస్యంగా పని చేస్తోంది. * ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లో జమాత్ ఏ ఇస్లామీ హింద్, విద్యార్థి విభాగంగా ఏప్రిల్ 25, 1977న సిమీ ఏర్పడింది. * ఇండియాలోని ఇతర మతాల వారందరినీ ముస్లిం మతంలోకి మార్చడం సిమీ వ్యవస్థాపక లక్ష్యం. * మాకోబ్ లోని వెస్ట్రన్ ఇల్లినాయిస్ యూనివర్శిటీ మీడియా స్టడీస్ ప్రొఫెసర్ మహమ్మద్ అహ్మదుల్లా సిద్ధిఖీ మనసులో నుంచి వచ్చిన ఆలోచనే సిమీ. ఈ గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా అహ్మదుల్లాయే. * సిమీ కార్యకలాపాలు యూపీ, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర (ఔరంగాబాద్, మాలేగావ్, జల్ గావ్, థానే), అసోంలతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ విస్తరించాయి. * ఇండియాను ఇస్లాం రాజ్యం చేయాలన్న ఏకైక లక్ష్యంతో భారత్ కు వ్యతిరేకంగా సిమీ జీహాద్ ను ప్రకటించింది. * 2001లో సిమీ కార్యదర్శి సఫ్దర్ నగోరీని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నాడు. * సిమీపై నిషేధం 2019 వరకూ పొడిగించగా, దీన్ని సవాల్ చేస్తూ పీపుల్స్ యూనియన్ ఫర్ డెమొక్రటిక్ రైట్స్ అనే సంస్థ కోర్టును ఆశ్రయించింది. * 2006లో ముంబైలో రైళ్లను పేల్చి 187 మంది మరణానికి కారణం కావడం, ఆపై 2008లో గుజరాత్ లో బాంబులు పేల్చి 45 మందిని చంపడం వంటి కేసులు సిమీపై ఉన్నాయి. * చాపకింద నీరులా విస్తరిస్తున్న సిమీని పూర్తిగా తుదముట్టించేందుకు కట్టుబడివున్నామని నాటి యూపీఏ, నేటి ఎన్టీయే ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నప్పటికీ, వారి కార్యకలాపాలు ఎక్కడో ఒకచోట సాగుతూనే ఉన్నాయి.