: ఆయుధాలతో వచ్చిన దుండగులపైకి 'ఆగండ్రా, నేను వస్తున్నా...' అంటూ ఉరికిన ఎన్నారై మహిళ!
అది లండన్ లోని చేషైర్ ప్రావిన్స్ లోని విన్స్ ఫోర్ట్ పట్టణం. అక్కడ ప్రవాస భారతీయురాలు హేమలతా పటేల్ (56) ఓ స్టోర్ ను నిర్వహిస్తున్నారు. ఆమె షాపులో దోపిడీకి వచ్చిన ఇద్దరు దుండగులను ఆమె ఎదుర్కొన్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్. అసమాన ధైర్యసాహసాలను ఆమె ప్రదర్శించగా, ఇప్పుడామెను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ముసుగులు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు స్టోర్ లోకి వచ్చి, హేమలతతో పాటు అక్కడే ఉన్న మరో ఇద్దరు మహిళలను కత్తితో బెదిరించారు. ఈ ఘటనతో ఏ మాత్రం భయపడని హేమలత, దొంగలను ఎదిరించారు. తనకు అందుబాటులో ఉన్న స్టీలు కుర్చీని చేతుల్లోకి తీసుకుని, "ఆగండ్రా వస్తున్నా" అంటూ దొంగలను దుకాణం నుంచి తరిమికొట్టారు. ఆ సమయంలో హేమలత భర్త దీరూభాయ్, ఆమె మనవరాళ్లు స్టోర్ వెనుకవైపున ఉన్నారట. హేమలత కేకలు విని వారు పరుగున వచ్చేసరికి దొంగలు పారిపోయారు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది. 1984 నుంచి వీరి కుటుంబం ఇక్కడ స్టోర్ ను నిర్వహిస్తుండగా, 2011లోనూ ఓ సారి చోరీ ప్రయత్నం జరిగిందని హేమలత తెలిపారు. ఇదిలావుండగా, ఈ దుండగులు 16, 14 ఏళ్ల మైనర్లని, వీరిని అరెస్ట్ చేసి, ఆపై బెయిల్ పై విడుదల చేశామని చేషైర్ పోలీసులు వెల్లడించారు. కేసును దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.