: ఒక్క రాత్రిలోనే ఢిల్లీ కాలుష్యం 42 శాతం పెరిగింది!
ఇప్పటికే కాలుష్యకాసారంలో మగ్గిపోతున్న దేశ రాజధాని ఢిల్లీ... దీపావళి దెబ్బకు మరింత దారుణంగా తయారయింది. దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీ ప్రజలు భారీగా బాణాసంచా కాల్చడంతో... ఈ ఉదయం ఢిల్లీలో కాలుష్యంతో కూడిన పొగమంచు అలముకుంది. ఒక్క రాత్రిలోనే ఢిల్లీలోని వాయు కాలుష్యం ఏకంగా 42 శాతం పెరిగిపోయింది. కాలుష్యంతో కూడిన పొగమంచు నగరాన్ని దుప్పటిలా కప్పేయడంతో... ఉదయాన్నే కార్యాలయాలకు వెళుతున్న వారికి రోడ్లపై వచ్చే వారు కూడా సరిగా కనిపించని పరిస్థితి నెలకొంది. విషవాయువుల ప్రభావం వల్ల శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది. మరోవైపు, కాలుష్యం ఈ స్థాయిలో పెరిగిపోవడం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఇదే పరిస్థితి మరో మూడు రోజులు కొనసాగితే... పాఠశాలలు, కార్యాలయాలు మూతపడే అవకాశం ఉంది.