: తొలిసారిగా స్వయంగా దీపాలు వెలిగించిన బరాక్ ఒబామా... వైట్ హౌస్ లో ఘనంగా దీపావళి
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తొలిసారిగా వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులో దీపావళి పర్వదినాన్ని వైభవంగా జరుపుకున్నారు. స్వయంగా దీపాలు వెలిగించారు. తన తదుపరి అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేవారు కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. 2009లో వైట్ హౌస్ లో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్న ఆయన, ఈ దఫా తన వద్ద పనిచేసే భారత సంతతి ఉద్యోగులతో కలసి స్వయంగా దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఈ సంవత్సరం నేను ఓవల్ ఆఫీసులో తొలిసారిగా దీపాన్ని వెలిగించాను. ఈ దీపం చీకట్లను పారద్రోలే అస్త్రం. ఈ సంప్రదాయాన్ని తదుపరి అధ్యక్షులు కూడా కొనసాగిస్తారని భావిస్తున్నా. ఈ దీపావళి ప్రజల్లో ఆనందాన్ని నింపాలని ఒబామా కుటుంబం తరఫున అభినందనలు తెలుపుతున్నా. అమెరికాలో, ప్రపంచవ్యాప్తంగా దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటున్న హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులకు శుభాభినందనలు" అని చెబుతూ, వైట్ హౌస్ ఫేస్ బుక్ పేజీలో తాను దీపం వెలిగిస్తున్న చిత్రాన్ని పోస్ట్ చేశారు. గంటల వ్యవధిలోనే ఈ పోస్టును లక్షన్నర మందికి పైగా లైక్ చేయగా, 33 వేల మంది షేర్ చేసుకోవడం విశేషం.