: కొత్త రియల్ ఎస్టేట్ చట్టం రానుంది... ప్రాజెక్టు ఆలస్యమైతే 12 శాతం వడ్డీ కట్టాల్సిందే!
సొంతింటి కలను నిజం చేసుకోవాలని భావిస్తూ, లక్షలాది రూపాయలను పెట్టుబడులుగా పెట్టే వారి ప్రయోజనాలను రక్షించేలా కేంద్ర ప్రభుత్వం తయారు చేసిన 'రీరా' (రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్ మెంట్ యాక్ట్) కు సోమవారం నోటిఫికేషన్ వెలువడనున్నట్టు తెలుస్తోంది. గృహ వినియోగదారులకు ముందుగా ఇచ్చిన హామీ ప్రకారం సకాలంలో ఇంటిని డెలివరీ ఇవ్వకుండా ఆలస్యం చేస్తే, బిల్డర్లు 12 శాతం వడ్డీని చెల్లించాల్సి వుంటుంది. ఈ కొత్త చట్టం తొలుత కేంద్ర పాలిత ప్రాంతాలైన చండీగఢ్, అండమాన్ అండ్ నికోబార్, డామన్, డ్యా, దాద్రా నగర్ హవేలీ, లక్షద్వీప్ లలోను, ఆపై ఢిల్లీలో నెల వ్యవధిలోను అమల్లోకి వస్తుందని పట్టణాభివృద్ధి శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఆపై దశలవారీగా యూపీ, మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్, పంజాబ్, గోవాల్లో అమలు చేస్తామని, యూపీలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే ఈ చట్టం అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. కాగా, ఈ చట్టాన్ని నిర్మాణ రంగ కంపెనీలు సైతం స్వాగతిస్తున్నాయి. చట్టం అమల్లోకి వస్తే, అంతంతమాత్రంగా ఉన్న నిర్మాణ రంగానికి ఉద్దీపన లభిస్తుందని, ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని డెవలపర్లు వ్యాఖ్యానించారు.