: పండగ పూట అట్టుడుకుతున్న ఎల్ఓసీ... పేలుతున్న శతఘ్నులు
దీపావళి పర్వదినం నాడు పాక్ వైపు నుంచి భారత పోస్టులే లక్ష్యంగా భారీ ఎత్తున కాల్పులు జరుగుతుండగా సైనికులు దీటుగా బదులిస్తుండటంతో వాస్తవాధీన రేఖపై పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మచ్చిల్, ఆర్ఎస్ పురా, కేరన్ సెక్టార్లతో పాటు అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ కవ్విస్తుండటంతో, ప్రతిగా భారత సైన్యం శతఘ్నులను పేల్చుతోంది. గత రాత్రి బొరివాలా పోస్టుపై దాడులు జరుగగా, 156వ బెటాలియన్ కు చెందిన నితిన్ కోయిల్ గాయపడ్డాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించామని సైనికాధికారి ఒకరు తెలిపారు. సరిహద్దులు దాటి భారత్ లోకి ప్రవేశించి ఓ జవానును చంపి ముక్కలు చేయడాన్ని సీరియస్ గా తీసుకున్న సైన్యం, పాక్ నుంచి ఒక్క తుపాకి శబ్దం వినిపించినా, రెచ్చిపోయి ఆ ప్రాంతంపై తూటాల వర్షం కురిపిస్తోంది. గత రాత్రి నాలుగు పాక్ పోస్టులపై భారత దళాలు దాడులు చేసి వాటిని సమూలంగా నాశనం చేసిన సంగతి తెలిసిందే.