: 200 విదేశీ యుద్ధ విమానాలు కొంటాం... షరతులు వర్తిస్తాయంటున్న మోదీ సర్కారు
భారత వాయుసేన భవిష్యత్ అవసరాల నిమిత్తం 200 సింగల్ ఇంజన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం, విదేశీ ఫైటర్ జెట్ తయారీ సంస్థలను ఆహ్వానిస్తోంది. అయితే, ఈ విమానాలను ఇండియాలోనే తయారు చేయాలని, అందుకోసం అవసరమయ్యే స్థలాన్ని తామిస్తామని, ఇక్కడికి వచ్చి మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పి యుద్ధ విమానాలు అందించే సంస్థకే ఈ కాంట్రాక్టు ఇస్తామని స్పష్టం చేస్తోంది. సుమారు రూ. లక్ష కోట్ల వరకూ అంచనా వ్యయంతో ఈ డీల్ కుదుర్చుకోవాలన్నది భారత్ ఆలోచన. కాగా, గత నెలలో ఫ్రాన్స్ కు చెందిన దస్సాల్ట్ కంపెనీతో 36 ఫైటర్ జెట్ విమానాల కొనుగోలుకు ఇండియా ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇక వాయుసేన వద్ద రష్యాకు చెందిన పాతతరం విమానాలే ఉండటం, మిగ్ విమానాలు తరచూ ప్రమాదాలకు గురవుతుండటంతో, వాటన్నింటినీ మార్చాలని మోదీ సర్కారు భావిస్తోంది. ఇదే సమయంలో 'మేకిన్ ఇండియా'కు ఊతమిచ్చేలా ముందుకు వచ్చే కంపెనీలను ప్రోత్సహించాలని నిర్ణయించింది.