: ఢిల్లీలో 10 మంది ఐఎస్ఐ ఉద్యోగులు: వెళ్తూ వెళ్తూ బాంబు పేల్చిన మహమూద్ అఖ్తర్
దౌత్యపరమైన రక్షణ ఉంటుందన్న ఏకైక కారణంతో ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో 10 మంది వరకూ ఐఎస్ఐకి పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారని దేశ బహిష్కరణకు గురైన దౌత్యాధికారి మహమూద్ అఖ్తర్ బాంబు పేల్చాడు. సైన్యానికి చెందిన రహస్య పత్రాలను పాకిస్థాన్ కు చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై అఖ్తర్ ను అరెస్ట్ చేసి విచారించిన పోలీసులకు పలు కీలక విషయాలు తెలిశాయి. పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ తరఫున పది మంది ఢిల్లీలో వివిధ స్థాయుల్లో పని చేస్తున్నట్టు ఆయన వెల్లడించినట్టు సమాచారం. జోధ్ పూర్ లో వీసాలిప్పించే మధ్యవర్తి షోయబ్, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ చౌదరి మునాబర్ సలీం వద్ద సెక్రటరీగా ఉన్న ఫర్హత్ లు తనకు ఏజంట్లని ఆయన చెప్పడంతో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్న వారిని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశాలు లేకపోవడంతో, మహమూద్ ను దేశం నుంచి పంపించి వేయగా, అందుకు ప్రతీకారంగా పాక్ రాయబార కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సుర్జీత్ సింగ్ ను ఆ దేశం బహిష్కరించిన సంగతి తెలిసిందే.