: ప్రధానిని విడివిడిగా కలిసిన రతన్ టాటా, సైరస్ మిస్త్రీ
భారత ప్రధాని నరేంద్ర మోడీని టాటా సన్స్ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా, తొలగించబడ్డ చైర్మన్ సైరస్ మిస్త్రీలు విడివిడిగా కలిశారు. టాటా సన్స్ లో నెలకొన్న సంక్షోభం, తనను ఏకపక్షంగా తొలగించిన వైనంపై సైరస్ మిస్త్రీ వివరణ ఇవ్వగా, బోర్డు స్థాయిలో జరిగిన మార్పులకు కారణాలను రతన్ టాటా వివరించినట్టు సమాచారం. ఒక రోజు తేడాలో వీరిద్దరూ మోదీని కలుసుకుని తమ వాదనలు వినిపించినట్టు తెలుస్తోంది. ఆపై రతన్ టాటా అరుణ్ జైట్లీని కూడా కలుసుకుని సంస్థలో నెలకొన్న పరిస్థితులు, మిస్త్రీ వైఖరి, ఆయన తొలగింపునకు దారితీసిన కారణాలను తెలియజేసినట్టు టాటా సన్స్ వర్గాలు వెల్లడించాయి. తనను తొలగించిన తరువాత మిస్త్రీ టాటా సన్స్ పై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనకు స్వేచ్ఛను ఇవ్వలేదని, ప్రతి నిర్ణయం వెనుకా రతన్ టాటా హస్తముందని ఆయన ఆరోపించారు. కాగా, తదుపరి నాలుగు నెలల సమయంలో కొత్త చైర్మన్ ను ఎంపిక చేసేందుకు తనతో పాటు ఐదురుగు సభ్యుల సెర్చ్ కమిటీని రతన్ టాటా నియమించిన సంగతి తెలిసిందే.