: ఇండియా-పాకిస్థాన్ మరో పోరు... నేటి సాయంత్రం 6 గంటలకు హాకీ ఫైనల్స్
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న హాకీ పోటీల్లో భారత జట్టు కొరియాపై విజయం సాధించి ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై ఆడనుంది. ఈ మ్యాచ్ నేటి సాయంత్రం 6 గంటలకు జరగనుంది. శనివారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో నిర్ణీత సమయం గడిచే వరకు ఇరు జట్లు 2-2తో సమంగా ఉండటంతో పెనాల్టీ షూటౌట్ తప్పలేదు. పెనాల్టీ షూటౌట్ లో 5-4 తేడాతో భారత జట్టు కొరియాపై విజయం సాధించింది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు చేరుకోవడం భారత్‌కు ఇది మూడోసారి. మరో సెమీఫైనల్ పోటీలో పాక్ జట్టు 3-2 తేడాతో ఆతిథ్య మలేసియాను ఓడించింది. ఇక భారత్, పాక్ జట్లు ఫైనల్ లో పోటీ పడనుండటం, పైగా దీపావళి పర్వదినం ఉండటంతో భారత జట్టుపై ఒత్తిడి అధికంగా ఉంది. లీగ్ దశలో పాక్ పై జరిగిన పోరులో విజయం సాధించిన ఊపు మీదున్న భారత జట్టు, అదే ప్రదర్శనను కొనసాగించాలని భావిస్తుండగా, లీగ్ దశ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ గట్టి పట్టుదలతో ఉంది.