: ‘జయహో టీమిండియా’.. ఘోరంగా విఫలమైన కివీస్ బ్యాట్స్‌మెన్.. ఘనవిజయంతో దీపావళి కానుకనందించిన టీమిండియా
విశాఖలోని పోతిన మల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ రాజశేఖరరెడ్డి స్టేడియంలో జరుగుతున్న భారత్, న్యూజిలాండ్ ఫైనల్ వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు అదరగొట్టారు. న్యూజిలాండ్ ముందు టీమిండియా 270 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన విషయం తెలిసిందే. లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ జట్టు ఏ మాత్రం రాణించలేకపోయింది. టీమిండియా బౌలర్ల ధాటికి కివీస్ వెనువెంటే వికెట్లు సమర్పించుకుంది. దీంతో టీమిండియా ఘన విజయం సాధించింది. మ్యాచ్ అంతా పూర్తి ఏకపక్షంగా సాగింది. 79 పరుగులకే న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసిన భారత్ ఆఖరి వన్డేలో విజయం సొంతం చేసుకొని ఐదు వన్డేల సిరీస్ లో 3-2 తేడాతో కప్పుకొట్టేసింది. ఘనవిజయంతో టీమిండియా తన అభిమానులకు దీపావళి కానుకనందించింది. న్యూజిలాండ్ జట్టులో ఓపెనర్ గుప్తిల్ డకౌట్ కాగా, లాథమ్ 19, కానె విలియమ్సన్ 27, టైలర్ 19, పరుగులు చేసి వెనుతిరిగారు. ఆ తరువాత వాట్లింగ్, అండర్సన్, సౌతీ, సోధీ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. నీషామ్ 3, సాంత్నర్ 4, బౌల్ట్ 1 పరుగులు మాత్రమే చేశారు. టీమిండియా బౌలర్లు ఉమేష్, బుమ్రా, యాదవ్ చెరో వికెట్ తీశారు. అక్షర్ రెండు వికెట్లు తీయగా మిశ్రా విజృంభించి ఐదు వికెట్లు తీశాడు. టీమిండియా బ్యాట్స్ మెన్ రహానే 20, రోహిత్ శర్మ 70, విరాట్ కోహ్లీ 65, ధోనీ 41, జాధవ్ 37, అక్షర్ 24, యాదవ్ 1 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్, సోధీలకు చెరో రెండు వికెట్లు దక్కాయి. నీషాం, సాంత్నర్‌లకు చెరో వికెట్టు లభించింది.