: అరుణ్ జైట్లీని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించలేదు?: బొత్స సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ నవ్య రాజధాని అమరావతిలో నిన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు చేసిన ప్రసంగాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. ఇరువురు కేంద్రమంత్రులు ఎన్నో అబద్ధాలు చెప్పారని విమర్శించారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరువురు కేంద్ర మంత్రులను పొగడడానికే సమయం వెచ్చించారని విమర్శించారు. సభలో జైట్లీ ముందు చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను ప్రస్తావించలేదని బొత్స సత్యనారాయణ అన్నారు. ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్ యూనివర్శిటీలను రాష్ట్రానికి ఇస్తున్నామని సభలో అన్నారని, వాటిని ఏపీ కంటే చిన్న రాష్ట్రాలకు కూడా ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. 14వ ఆర్థిక సంఘం ప్రతిపాదనలతోనే రాష్ట్రానికి 2 లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నామని జైట్లీ చెప్పారని, అలాంటప్పుడు ఇక కొత్తగా రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిందేమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారని అన్నారు. జైట్లీని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించలేదని ఆయన అడిగారు. ప్రజలు అన్ని విషయాలను తెలివిగా గమనిస్తూనే ఉన్నారని ఆయన అన్నారు.