: మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో.. చంద్రబాబుకు భద్రత పెంపు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆంధ్ర-ఒడిశా బోర్డర్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగిన నేపథ్యంలో, చంద్రబాబుపై ఆత్మాహుతి దాడులు జరుపుతామంటూ మావోయిస్టులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. చంద్రబాబుకు భద్రతగా కమెండోల సంఖ్యను మరింత పెంచారు. ఉండవల్లిలోని ఆయన నివాసం, విజయవాడలోని సీఎం కార్యాలయం వద్ద సెక్యూరిటీని మరింత బలోపేతం చేశారు. అంతేకాదు, ఆయన పర్యటనపై కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రిని కలిసేందుకు వస్తున్న వ్యక్తులను కూడా నియంత్రిస్తున్నారు. సామాన్యులకు అపాయింట్ మెంట్లు పూర్తిగా ఆపేసినట్టు సమాచారం. ఇదే సమయంలో ప్రజాప్రతినిధులకు కూడా పోలీసులు పలు సూచనలు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు తమకు సమాచారం ఇవ్వాలని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ లో 30 మంది మావోయిస్టులు హతమయిన సంగతి తెలిసిందే.