: తన ఆస్తుల్లో 70 శాతం వీధి బాలలు, మహిళా సంక్షేమానికి చెందాలంటూ వీలునామా రాసిన అలనాటి నటి పర్వీస్ బాబీ
అలనాటి బాలీవుడ్ నటి పర్వీన్ బాబీ తన ఆస్తుల్లో 70 శాతాన్ని సమాజ సేవ కోసమే రాసిచ్చి మరణించింది. ఈ వీలునామాను ఆమె తన మేనమామ మురాద్ఖాన్ జాయింటు బ్యాంకు ఖాతా లాకర్లో ఉంచింది. అయితే, ఈ విషయంపై ఆమె దగ్గరి బంధువులు కోర్టులో ఛాలెంజి చేశారు. దీనిపై సుదీర్ఘవిచారణ జరిపిన అనంతరం బాంబే హైకోర్టు ఆమె మృతిచెందిన పదకొండేళ్ల తర్వాత వీధి బాలలు, మహిళా సంక్షేమానికి ఆమె రాసిన వీలునామాను చట్టబద్ధమైనదని తేల్చిచెప్పింది. దీంతో ఆమె పేరిట ఒక ట్రస్టును ఏర్పాటు చేసి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆమెకు సంబంధించిన మిగతా 30 శాతం ఆస్తుల్లో వీలునామా ప్రకారం, 20 శాతం తనను పెంచిన మేనమామకు, మరో 10 శాతం క్రిస్టియన్ మిషనరీ సంస్థకు వెళ్లనున్నాయి. ఆమె తన చివరి రోజుల్లో క్రిస్టియన్ మతాన్ని స్వీకరించింది. మురాద్ఖాన్కు ఇప్పుడు ఎనభై ఏళ్ల వయసు ఉంటుంది. అనారోగ్యంతో బాధపడుతూ పర్వీన్ బాబి తన చివరి రోజుల్లో వీల్ చైర్‌కే పరిమితమైపోయింది. ఒంటరి జీవితాన్ని గడిపిన ఆమె తన ఇంటిలోనే చనిపోయింది. ఆమె మరణించాక మూడు రోజుల వరకు ఆ విషయాన్ని ఎవరూ గమనించలేదు. దీంతో పోలీసులు పోస్టుమార్టం కూడా నిర్వహించారు. ప్రస్తుతం శాంతా క్రూజ్ ముస్లిం స్మశాన వాటికలో స్థలాభావం ఉండడంతో ఆమె శవ పేటికతో పాటు అక్కడ ఉన్న దివంగత మహమ్మద్ రఫీ, మధుబాల, సాహిర్ లూదియాన్వి, నౌషాద్ ఆలి, తలత్ మెహమూద్ శవపేటికలను కొన్ని రోజుల ముందే వేరే ప్రాంతానికి తరలించారు. పర్వీన్ బాబీ.. దీవార్, నమక్ హలాల్, షాన్, అమర్ అక్బర్ ఆంథోని వంటి చిత్రాల్లో నటించి అభిమానులను సొంతం చేసుకున్నారు. గ్లామరస్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు.