: నేడే ఫైనల్... మధ్యాహ్నం 1:30 నిమిషాలకు మ్యాచ్
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. విశాఖలోని పోతిన మల్లయ్యపాలెంలోని ఏసీఏ-వీడీసీఏ రాజశేఖరరెడ్డి స్టేడియం వేదికగా 1:30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టెస్టు హోదా సంపాదించిన ఈ స్టేడియంలో టీమిండియాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ లు జరగగా, నాలుగింటిలో టీమిండియా విజయం సాధించింది. ధోనీ కెరీర్ లో ఈ స్టేడియంది ప్రత్యేక పాత్ర. కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ మరోసారి ధోనీ ఇక్కడ ఆడడనుండడంపై సర్వత్ర ఆసక్తి వ్యక్తమవుతోంది. బ్యాటింగ్ లో టాపార్డర్ వైఫల్యం టీమిండియాను ఇబ్బంది పెడుతుండగా, కివీస్ బ్యాట్స్ మన్ ఫాంలోకి వచ్చి ఉత్సాహంతో ఉన్నారు. ఇక ఈ తుది సమరంలో బుమ్రాను తీసుకోవడం ద్వారా యార్కర్ల దాడి పెంచాలన్నది ధోనీ ఆలోచన. ధోనీ, రోహిత్, కోహ్లీ రాణించాలని సగటు విశాఖ అభిమాని కోరుకుంటున్నాడు. ఈ ముగ్గురూ రాణిస్తే టీమిండియా విజయం నల్లేరుమీద నడకే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదే సమయంలో టీమిండియాపై ఈ మ్యాచ్ లో గెలవడం ద్వారా వన్డే సిరీస్ ను చేజిక్కించుకోవాలని కివీస్ భావిస్తోంది. కివీస్ బౌలర్లు ఫుల్ స్వింగ్ లో ఉండగా, బ్యాట్స్ మన్ గాడినపడ్డారు. ఫీల్డర్లు పాదరసంలా కదులుతున్నారు. భారత్ నుంచి ఎదురయ్యే ఏ సవాలునైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, గత మ్యాచ్ లా టీమిండియాపై పైచేయి సాధిస్తామని కివీస్ ఆటగాళ్లు చెబుతున్నారు.