: అమెరికాను బెంబేలెత్తిస్తున్న విమాన ప్రమాదాలు
అమెరికాలో విమాన ప్రమాదాలు బెంబేలెత్తించాయి. కాలిఫోర్నియా ఎయిర్ పోర్టులోని రన్ వే పై ప్రయాణానికి సిద్ధంగా ఉన్న ఫెడెక్స్ కార్గో విమానం వెనుకభాగం ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో విమానాశ్రయ సిబ్బంది బెంబేలెత్తిపోయారు. అనంతరం షికాగో ఎయిర్ పోర్టులో రన్ వే పై టేకాఫ్ కు సిద్ధంగా ఉన్న పాసింజర్ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది అత్యవసర ద్వారాలను తెరిచి, వాటి ద్వారా ప్రయాణికులను బయటకు పంపించేశారు. అనంతరం వారు కూడా వాటి ద్వారా కిందికి దూకి పరుగులంకించుకున్నారు. ఈ లోగా ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పారు. ఈ రెండు ప్రమాద ఘటనలను ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వెలుగులోకి వచ్చాయి. కాగా, ఈ విమాన ప్రమాదాల్లో జరిగిన నష్టాలు, ప్రమాదాలకు కారణాలు తెలియాల్సి ఉంది. వరుస విమాన ప్రమాదాలతో అమెరికాలో ఆందోళన నెలకొంది.