: 'కుంబ్లే భాయ్... వైజాగ్ రమ్మంటావా? వద్దా?' చెప్పు అంటున్న సెహ్వాగ్
క్రీజులో ఉన్నంత కాలం భారీ షాట్లతో వీరవిహారం చేసిన సెహ్వాగ్, క్రీజు వీడిన తరువాత ట్విట్టర్ లో వేదికగా చెలరేగిపోతున్నాడు. తాజాగా తన సహచరుడు, ప్రస్తుత టీమిండియా చీఫ్ కోచ్ కు ట్విట్టర్ ద్వారా సలహా అడిగి ఆకట్టుకుంటున్నాడు. జట్టుతో పాటు విశాఖపట్టణం చేరుకున్న కుంబ్లే, తాను బస చేసిన నోవాటెల్ హోటల్ నుంచి కనువిందు చేస్తున్న వైజాగ్ అందానికి పరవశించిపోయాడు. ఈ నేపథ్యంలో తన కెమెరాతో సముద్ర తీరాన్ని ఫొటో తీసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దీనికి స్పందించిన సెహ్వాగ్ ‘మంచి ఫొటో తీశావు అనిల్ భాయ్. ప్రస్తుతం విశాఖకి కయాంత్ తుపాను ప్రమాదం పొంచి ఉంది కదా.. మ్యాచ్ వ్యాఖ్యాతగా నన్ను అక్కడకు రమ్మంటావా? లేదా ఇంటికి వెళ్లిపొమ్మంటావా? కాస్త వూహించి చెప్పు’ అని ట్వీట్ చేశాడు. దీనికి బదులిచ్చిన కుంబ్లే... సెహ్వాగ్ కి దీపావళి శుభాకాంక్షలు చెబుతూనే... ప్రకృతి విపత్తుని ఎవరూ వూహించలేమంటూ బదులిచ్చాడు. వీరి ట్వీట్లు అభిమానులను అలరిస్తున్నాయి.