: సరికొత్త సవాల్ ను స్వీకరించిన ఇస్రో... ఒకే రాకెట్ తో 83 ఉపగ్రహాలు!
భారతదేశ కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింపజేసిన ఇస్రో సరికొత్త సవాల్ ను స్వీకరించింది. కనీవినీ ఎరుగని రీతిలో ఒకే రాకెట్ తో 83 ఉపగ్రహాలను మోసుకెళ్లి కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ఇందులో 81 ఉపగ్రహాలు విదేశాలకు చెందినవి కాగా, భారత్ కు చెందిన రెండు ఉపగ్రహాలు ఉన్నాయని ఇస్రో తెలిపింది. ఈ రాకెట్ ప్రయోగం 2017 తొలి త్రైమాసికంలో జరగనుందని యాంత్రిక్స్ కార్పొరేషన్ సీఎండీ రాకేశ్ శశిభూషణ్ తెలిపారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ, ఒకే రాకెట్ లో 83 ఉపగ్రహాలను పంపడం పెద్ద సాహసమని, అందులోనూ ఇతర దేశాలకు చెందిన నానో ఉపగ్రహాలను పెద్ద సంఖ్యలో పంపుతున్నామని చెప్పారు. ఈ 83 ఉపగ్రహాలను ఒకే కక్ష్యలో ప్రవేశపెట్టనున్నామని ఆయన వెల్లడించారు. ఈ ప్రయోగంలో అతిపెద్ద సాహసం ఏంటంటే... ఈ 83 ఉపగ్రహాలను ఏక కక్ష్యలో ప్రవేశపెట్టేంతవరకు అదే కక్ష్యలో రాకెట్ స్థిరంగా ఉండడంమని ఆయన పేర్కొన్నారు. కష్టసాధ్యమైన ఈ రికార్డు స్థాయి ప్రయోగానికి తనకు ఎంతగానో అచ్చొచ్చిన పీఎస్‌ఎల్‌వీ ఎక్స్‌ఎల్ రకం రాకెట్ నే మరోసారి ఇస్రో నమ్ముకుంది. ఈ రాకెట్ మొత్తం 1,600 కేజీల బరువును అంతరిక్షంలోకి మోసుకెళ్లగల సామర్థ్యం కలిగినదని ఆయన తెలిపారు. కాగా, ఇస్రోకు యాంత్రిక్స్ కార్పొరేషన్ వాణిజ్య విభాగంగా పనిచేస్తుంది.