: గుంటూరు జిల్లాలో ఆంబోతు దాడిలో వృద్ధుడి మృతి
ఆంబోతు దాడిలో వృద్ధుడు మృతి చెందిన సంఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగింది. అక్కడి అల్లంవారిపాలెంకు చెందిన పుసులూరి వెంకటేశ్వర్లు (70) ఎప్పటిలాగే ఈరోజు ఉదయం టిఫిన్ చేసేందుకు బస్టాండ్ సెంటర్ లోకి వెళ్లాడు. అయితే, అదే సమయంలో రోడ్డు పక్కన ఉన్న ఆంబోతు ఒక్కసారిగా రంకెలు వేసింది. దీంతో, భయాందోళనలకు గురైన అక్కడి వారు పరుగులు తీశారు. అయితే, వృద్ధుడైన వెంకటేశ్వర్లు పరుగులు తీయలేకపోవడంతో, అతనిపై దాడి చేసింది. కొమ్ములతో వృద్ధుడి పొట్టలో పొడవటంతో రోడ్డుపై పడిపోయిన ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే, స్థానికులు ఆ వృద్ధుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.