: ప్రత్యేక హోదాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: చంద్రబాబు ఆగ్రహం
ప్రత్యేక హోదాకు, ప్యాకేజీకి వ్యత్యాసం లేనప్పుడు దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు అమరావతిలో పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ... రాష్ట్రానికి హోదాతో ఏ ప్రయోజనం జరుగుతుందని కాంగ్రెస్, వైసీపీలు అడుగుతున్నాయని అన్నారు. హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయని పలువురు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అది నిజంకాదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలని తప్పుదారి పట్టించకూడదని సూచించారు. రాష్ట్రానికి కేంద్ర సహకారం అవసరముందని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామని ప్యాకేజీ ఇచ్చారని, కేంద్ర ప్రభుత్వం ఎంతో సాయాన్ని అందిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. తాను అరుణ్‌జైట్లీతో సమావేశమై రాష్ట్ర పరిస్థితులను అన్నిటినీ వివరించానని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి ఎన్నో సమస్యలున్నాయని వాటన్నింటినీ పరిష్కరించాలని వేదికపై నుంచే అరుణ్‌జైట్లీని చంద్రబాబు మరోసారి కోరారు. అనంతపురంలో సెంట్రల్ వర్సిటీకి బిల్లు ఆమోదం పొందాల్సి ఉందని చెప్పారు. రాష్ట్ర ఆదాయం ఎంతో తక్కువగా ఉందని చంద్రబాబు చెప్పారు.