: చంద్రబాబు హైదరాబాద్ ను అధునాతన నగరంగా తీర్చిదిద్దారు.. అలాగే అమరావతిని నిర్మిస్తారు!: అరుణ్‌జైట్లీ
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతగానో పాటుపడుతున్నారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఈ రోజు ఆయన అమరావతిలో మాట్లాడుతూ... చంద్రబాబు సమర్థవంతమైన నాయకత్వంలో రూపొందించబడే ఈ నూతన రాజధాని అత్యంత అధునాతమైన రాజధానిగా దేశంలోనే మంచి పేరును సంపాదించుకుంటుందని అన్నారు. ఢిల్లీకి వచ్చినప్పుడు, విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు ఏపీకి పెట్టుబడులపైనే చంద్రబాబు దృష్టి పెడతారని ఆయన చెప్పారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ను అధునాతన నగరంగా తీర్చిదిద్దారని అన్నారు. ఇప్పుడు మళ్లీ అమరావతిని నిర్మించే అవకాశం ఆయనకే కలిగిందని చెప్పారు. ‘చంద్రబాబు చేస్తోన్న అమరావతి నిర్మాణ పనులకి మేము మిమ్మల్ని ఒంటరి వారిని చేయం.. మీ వెంట మేము ఉన్నాం.. గతంలో ఐదేళ్లు కాంగ్రెస్ పాలనలో ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీకి కేటాయించిన నిధుల కంటే అధికంగా ఇప్పుడు ఏపీకి 2 లక్షల మూడు వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నాం. 14వ ఆర్థిక సంఘం సిపార్సుల మేరకు ఈ నిధులు కేటాయిస్తున్నాం. తక్కువ సమయంలోనే చంద్రబాబు నాయకత్వంలో రాజధానికి ప్రణాళికలు రచించారు. మేము అన్ని హామీలను అమలుపరుస్తాం. చంద్రబాబుకి ఎంతో దూరదృష్టి ఉంది... 13 జిల్లాలకు ఇంతవరకు రాని విద్యాసంస్థలను ఇచ్చాం. ఐఐటీ, ఎయిమ్స్ వంటి ఎన్నో సంస్థల్ని మంజూరు చేశాం. చంద్రబాబు ఎంత వేగంగా పనులు చేస్తారో అందరికీ తెలుసు. ఈరోజు మొదలు పెట్టిన పనులు పూర్తయితే తరువాత నగరం మరింత వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది’ అని జైట్లీ వ్యాఖ్యానించారు.