: కొందరు అసంతృప్తి, బాధ, కోపంతో ఉన్నారు... వారు ఎప్పటికీ అలాగే ఉంటారు: అమరావతిలో వెంకయ్య
భారత్ అభివృద్ధిలో ఎంతో ముందుకువెళుతోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయడు అన్నారు. ఏపీ కొత్త రాజధాని అమరావతి రహదారుల పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ... ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటుంటే భారత్ మెరుగైన వృద్ధి రేటుతో ఉందని చెప్పారు. అమరావతికి భూములిచ్చిన రైతుల పేరు చరిత్రలో నిలిచిపోతుందని ఆయన అన్నారు. రైతులు రాష్ట్ర బంగారు భవిష్యత్ కోసం భూములు ఇచ్చారని చెప్పారు. మార్పు కోసం ఎంతో ఓర్పుతో రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని వెంకయ్య అన్నారు. రాష్ట్ర పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్రం రాజకీయ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అధిక మొత్తంలో నిధులు, ప్రాజెక్టులు ఇచ్చిందని అన్నారు. అయినప్పటికీ కూడా కొందరు విమర్శిస్తున్నారని ఆయన చెప్పారు. ‘కొందరు అసంతృప్తితో ఉన్నారు... వారు ఎల్లప్పుడూ అలాగే ఉంటారు. కొందరు బాధతో ఉన్నారు.. కొందరు కోపంతో ఉన్నారు... వారిని మార్చలేం. వారు ఎల్లప్పుడూ అదే వైఖరితో ఉంటారు. భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు. చట్టంలో చెప్పినవన్నీ నూరు శాతం పూర్తి చేస్తాం. చట్టంలో చెప్పనివి కూడా చేస్తాం. అభివృద్ధి దిశగా పయనిద్దాం. చరిత్రలో అమరావతి రైతుల పేరు నిలిచిపోతుంది’ అని వెంకయ్య అన్నారు. ‘రాజధానికి స్వచ్ఛందంగా భూములిచ్చారు. దేశం మొత్తానికి ఈ ప్రాంత రైతులు ఆదర్శంగా నిలిచారు. విభజన సమయంలో నేను రాజ్యసభలో రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడినందుకే ఇప్పుడు ఈ మేలు జరుగుతోంది. కేంద్రం సాయంతో రాష్ట్రంలో నిరంతర విద్యుత్ అందుతుంది. దేశంలో రామరాజ్యం కోసం ప్రధాని తపిస్తున్నారు. కేంద్రంలో సరైన దిశ చూపే నాయకుడు ఉన్నారు. రాష్ట్ర రాజధానికి మెట్రో రైలు సదుపాయం కల్పిస్తాం’ అని వెంకయ్య వ్యాఖ్యానించారు.