: ప్రజల సెంటిమెంట్ ఏమయింది?.. ధన త్రయోదశి నాడు గోల్డ్ బిజినెస్ డల్!
ధన త్రయోదశి... అక్షయ తృతీయతో పాటు బంగారం కొనుగోలుకు అత్యంత శుభప్రదమైన దినంగా భావించే రోజు. నేడు బంగారం కొనుగోలు చేస్తే, మరో ధన త్రయోదశి వచ్చే వరకు దాని విలువ ఎంతో పెరుగుతుందన్నది అనాదిగా వస్తున్న నమ్మకం. ఈ సందర్భంగా ఆభరణాల వ్యాపారులు సైతం తమ అమ్మకాలు పెరుగుతాయని ఆశించి, ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటిస్తారు. కానీ, ఈ సంవత్సరం ధన త్రయోదశి జ్యూయెలర్స్ ను మెప్పించలేదని తెలుస్తోంది. వ్యాపార వర్గాల నుంచి ఆభరణాల తయారీదారులు, ట్రేడర్ల వరకూ బంగారం కొనుగోలు పట్ల ఆసక్తిని చూపించక పోవడంతో నేటి బులియన్ సెషన్లో బంగారం ధర క్షీణించింది. శుక్రవారం సెంటిమెంట్ కలిసొచ్చినా, బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 110 తగ్గి రూ. 30,590కి తగ్గింది. వెండి ధర సైతం 0.34 శాతం తగ్గింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.17 శాతం తగ్గి 1,266 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కాగా, అంతర్జాతీయ పరిణామాల కారణంగానే బంగారం ధరలు తగ్గాయని విశ్లేషకులు అంచనా వేశారు. మరోవైపు ఆభరణాల దుకాణాల్లో సైతం గత సంవత్సరం జరిగినంత వ్యాపారం జరగలేదని తెలుస్తోంది.