: ఎటూ కదల్లేక దాదాపు స్థిరంగా నిలిచిన స్టాక్ మార్కెట్!
నవంబర్ నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ప్రారంభం రోజున అటు అమ్మకాలు, ఇటు కొనుగోళ్లు పెద్దగా కనిపించకపోవడంతో క్రితం ముగింపునకు అటూ, ఇటుగా కదలాడిన బెంచ్ మార్క్ సూచికలు దాదాపు స్థిరంగా ముగిశాయి. మార్కెట్ కు దిశానిర్దేశం చేసే అంశాలేవీ లేకపోవడం, తదుపరి సెషన్లో 'సంవాత్' కొత్త మార్కెట్ సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిలో ఉన్నారని నిపుణులు వ్యాఖ్యానించారు. ఆదివారం సాయంత్రం ప్రత్యేక పూజల అనంతరం దీపావళి మూరత్ ట్రేడింగ్ ను గంటపాటు నిర్వహించనున్నట్టు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు వెల్లడించాయి. నవంబర్ తొలివారంలో వెల్లడయ్యే ద్రవ్యోల్బణం గణాంకాలు, ఐఐపీ డేటా తదితరాలు మార్కెట్ ను ముందుకు నడిపించవచ్చని ట్రేడ్ అనలిస్టులు వ్యాఖ్యానించారు. శుక్రవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 25.61 పాయింట్లు పెరిగి 0.09 శాతం లాభంతో 27,941.51 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 22.75 పాయింట్లు పెరిగి 0.26 శాతం లాభంతో 8,638 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.46 శాతం, స్మాల్ కాప్ 0.95 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 31 కంపెనీలు లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, జడ్ఈఈఎల్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, ఐసీఐసీఐ బ్యాంక్, ఐచర్ మోటార్స్, ఇన్ ఫ్రాటెల్, సిప్లా, టాటా పవర్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,927 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,556 కంపెనీలు లాభాలను, 1,094 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 1,12,98,312 కోట్లుగా నమోదైంది.