: కూంబింగ్ ఆపేశాం... ఆర్కే తప్పించుకున్నాడు: ఏపీ డీజీపీ
ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో కూంబింగ్ ను నిలిపివేశామని డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి బలగాలు వెనక్కు వస్తున్నాయని అన్నారు. మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే తమ అదుపులో లేడని స్పష్టం చేసిన ఆయన, ఆర్కే నుంచి సమాచారం లేకపోవడంతోనే పోలీసుల అదుపులో ఆయన ఉన్నాడని పలువురు ఆరోపిస్తున్నారని అన్నారు. ఆర్కే లక్ష్యంగా తాము ఎన్ కౌంటర్ జరిపినట్టు వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోలు ఉన్నారన్న నమ్మకమైన సమాచారంతో బలగాలను పంపామని, మావోలు ఎదురుకాల్పులు జరపడంతో ఎన్ కౌంటర్ తప్పలేదని వివరణ ఇచ్చారు. ఈ ప్రాంతంలో భారీ ఎత్తున ఆయుధాలు లభించాయని, దీన్ని బట్టి ఇక్కడికి పలువురు అగ్రనేతలు వచ్చి ఉండవచ్చని అంచనాకు వచ్చామని తెలిపారు. వారితో కలసి ఆర్కే తప్పించుకుని ఉండవచ్చని సాంబశివరావు వివరించారు.