: బాంబులను పసిగడుతున్న ఎలుకలు.. జంతువుల అక్రమ రవాణానూ గుర్తిస్తున్నాయి.. ఎంతో ఆసక్తి కనబరుస్తోన్న అమెరికా


పేలుడు పదార్థాలను గుర్తిస్తూ పోలీసు జాగిలాలు భద్రతా అధికారులకు ఎంతో సాయం చేస్తాయ‌న్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ ప‌నిని చేయ‌డంలో ఆఫ్రికా జాతి ఎలుకలు కూడా ప్ర‌ముఖ పాత్ర పోషిస్తున్నాయి. పోలీసు జాగిలాలు చేసే ప‌నిని చేస్తూ అధికారుల దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. దుండ‌గులు భూమిలో పాతి పెట్టిన పేలుడు ప‌దార్థాల‌ను ఈ ఎలుకలు గుర్తిస్తున్నాయి. అంతేకాక‌, జంతువులను అక్రమంగా రవాణా చేస్తోన్న వారిని కూడా ప‌ట్టిస్తూ వారెవ్వా అనిపించుకుంటున్నాయట. ఇప్పుడు వీటిపై అమెరికా ఎన‌లేని ఆస‌క్తిని క‌న‌ప‌రుస్తోంది. శునకాలలాగే వాసన ద్వారా బాంబుల‌ను గుర్తించే స్వభావాన్ని ఎలుక‌లు కలిగి ఉన్నాయని అక్క‌డి అధికారులు చెబుతున్నారు. అందుకే వాటికి ఈ అంశంపై శిక్షణనిస్తున్న‌ట్లు తెలిపారు. వైద్య శాస్త్రంలోనూ నిపుణులు ఎలుకలను త‌మ ప్ర‌యోగాల‌కు ఉప‌యోగిస్తార‌న్న విష‌యం తెలిసిందే. అయితే, ఎలుక‌లు రోగి లాలాజలం వాసన చూసి వారు వూపిరితిత్తులకు సంబంధించిన క్షయ (ట్యూబర్‌ క్యూలొసిస్‌) వ్యాధితో బాధపడుతుంటే ఆ విషయాన్ని కూడా గుర్తించేస్తున్నాయ‌ట‌. అందుకే అమెరికా ఇప్పుడు వీటి వెన‌కాల ప‌డుతోంది. ప్ర‌ధానంగా జంతువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వీటిని ఉప‌యోగించాల‌ని చూస్తున్నారు. ఓడల్లో జ‌రుగుతున్న ఈ అక్రమ ర‌వాణాను గుర్తించేలా ఎలుకలకు శిక్ష‌ణ‌నిచ్చి ‘యూఎస్‌ ఫిష్‌ అండ్‌ వైల్డ్‌ లైఫ్‌ సర్వీస్‌’ శాఖ ఇప్ప‌టికే కొన్ని ఎలుకలను ఫ్లోరిడాలోని ఓడరేవుల్లో ప్రయోగాత్మకంగా రంగంలోకి దించి ప‌రీక్షిస్తోంది. ఈ ప్ర‌యోగం మంచి ఫ‌లితాన్నిస్తే ఎలుక‌లను ఇటువంటి కార్య‌క్ర‌మాల్లో విరివిగా ఉప‌యోగించ‌నున్న‌ట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News