: హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలంటూ.. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ
హోంగార్డుల ఉద్యోగాలను వెంటనే క్రమబద్ధీకరించాలని తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పోలీసులతో సమానంగా వారికి వేతనం ఇవ్వాలని, ఆరోగ్య భద్రత కల్పించాలని కోరారు. ఈ మేరకు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. హోంగార్డులు చేపట్టిన ఉద్యమంపై వెంటనే స్పందించాలని లేఖలో రేవంత్ కోరారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే హోంగార్డుల సర్వీసులను పర్మినెంట్ చేస్తామని గతంలో తమరే చెప్పారని కేసీఆర్ కు గుర్తు చేశారు. సాటి పోలీసులతో హోంగార్డులపై దాడి చేయించడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ లో విధులు నిర్వహించే హోంగార్డులకు 30 శాతం అదనపు అలవెన్సులు, వారాంతపు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోతే హోంగార్డుల తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు.