: విహారయాత్రకు వచ్చి తెలుగుగంగలో మృతిచెందిన తమిళ అసిస్టెంట్ డైరెక్టర్
తమిళ చిత్ర పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎదుగుతున్న మెహిద్దీన్ ఫిరా, తన మిత్రులతో కలసి విహారయాత్రకు వచ్చి, దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఫిరా, తన ఇద్దరు స్నేహితులతో కలసి వరదయ్యపాళెం సమీపంలోని ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ వద్దకు వచ్చాడు. అక్కడ మద్యం సేవించేందుకు అనుమతి లేకపోవడంతో, మిత్రబృందమంతా కలసి దగ్గర్లోని తెలుగుగంగ కాలువ వద్దకు వెళ్లారు. అక్కడ వీరంతా ఈత కొట్టేందుకు కాలువలోకి దిగగా, నీటి ప్రవాహానికి ఎవరూ తిరిగి ఒడ్డుకు రాలేకపోయారు. వీరి కేకలు విన్న కొందరు ఇద్దరిని మాత్రం ఒడ్డుకు లాక్కొచ్చారు. ఫిరా మాత్రం మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని తెలిపారు.