: ఇండియాతో వాణిజ్య బంధాన్ని తెంచుకునే దిశగా పాకిస్థాన్
భారత్, పాకిస్థాన్ ల నడుమ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని, సరిహద్దుల్లో నిత్యమూ కాల్పుల ఉల్లంఘనలు జరుగుతున్న వేళ, ఇండియాతో వాణిజ్య బంధాన్ని తెంచుకోవాలని పాక్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇండియాతో అన్ని రకాల వాణిజ్య సంబంధాలను సస్పెండ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు పాకిస్థాన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు అబ్దుల్ రవూఫ్ ఆలమ్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నందున, పరిస్థితి మెరుగుపడే వరకూ ఎలాంటి వ్యాపారాలూ చేయరాదని భావిస్తున్నట్టు రావూఫ్ ఆలమ్ చెప్పారని 'డాన్' పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. పాకిస్థాన్ కేంద్రంగా వ్యాపార, వాణిజ్యాలు నిర్వహించుకునే ప్రతి ఒక్కరూ ఈ విషయమై ఐకమత్యంతో ఉన్నారని ఆయన చెప్పారు. సార్క్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో పాకిస్థాన్ కీలక పాత్ర పోషిస్తోందని వ్యాఖ్యానించిన ఆయన, ఇతర దేశాలతో మరింత బలమైన వాణిజ్య సంబంధాలు పెట్టుకునేందుకు కృషి చేస్తామని అన్నారు.