: పాక్ గూఢచర్యం కేసులో కీలక విషయాలను రాబట్టిన అధికారులు
పాకిస్థాన్‌కు భారత బలగాల గురించి సమాచారాన్ని ఇస్తోన్న ఆరోపణలపై ఇటీవలే పోలీసులు అదుపులోకి తీసుకున్న మౌలానా రంజాన్, సుభాష్ జాంగిడ్ గురించి పలు కీలక విషయాలు తెలిశాయి. వీరిరువురు పద్దెనిమిది నెలల నుంచి ఎంతో చాకచక్యంగా బీఎస్ఎఫ్ బలగాల నుంచి కీలక అంశాలను రాబట్టారట. బలగాల గురించి సమాచారం తెలుసుకోవడానికి భారత్ లోని పాకిస్థాన్ హైకమిషనర్ కార్యాలయంలో వీసా సెక్షన్లో అధికారి మొహమ్మద్ అఖ్తర్ వారితో మాట్లాడేవాడట. వీరిరువురికీ తనకు కావాల్సిన అంశాలపై వివరాలు తెలిపి పంపేవాడు. వారికి అఖ్తర్ డబ్బు కూడా చెల్లించినట్లు దర్యాప్తులో తెలిసింది. ఒక్కో డాక్యుమెంటుకు అఖ్తర్ నుంచి రూ.30 వేల నుంచి రూ.50వేల వరకు వారు తీసుకుంటూ పలు డాక్యుమెంట్లు అందజేశారని సమాచారం. ఇక ప్రత్యక్షంగా ఇతర వివరాలు చెబుతున్నందుకు ప్రతిసారి రూ.15వేల నుంచి రూ.20వేల వరకు తీసుకున్నట్లు తెలిసింది. మౌలానా రంజాన్, సుభాష్ జాంగిడ్‌లు రాజస్థాన్, గుజరాత్లోని సరిహద్దులో ఉన్న బీఎస్ఎఫ్ బలగాలతో సన్నిహితంగా మెలిగి, మెల్లిగా వివరాలు రాబట్టే వారని దర్యాప్తులో తేలింది. మొత్తం 13మంది బీఎస్ఎఫ్ బలగాలు వీరిరువురితో మాట్లాడేవారని దర్యాప్తులో వెలుగు చూసింది. దీంతో ఆయా అధికారులను కూడా అధికారులు విచారించనున్నట్లు తెలుస్తోంది. గత నెల రోజులుగా మౌలానాపై నిఘా ఉంచిన అధికారులు ఆర్మీ, పారామిలిటరీ నుంచి అతడు ఎలాంటి వివరాలనైనా సేకరించగల విధంగా వారితో వ్యవహరించేవాడని అన్నారు. బీఎస్ఎఫ్ అధికారుల్లో మౌలానా దూరపు బంధువులు కూడా ఉన్నారని సమాచారం.