: మంచి, చెడు ఏది జరిగినా వెనక్కి తిరగను: దీపికా పదుకొణె
తాను సినీ రంగంలోకి వచ్చి తొమ్మిదేళ్లు గడిచాయని తాను అనుకోవడం లేదని, ఇప్పటికీ కూడా కొత్తగానే భావిస్తున్నానని బాలీవుడ్ నటి దీపికా పదుకుణె అంటోంది. తన సినీ జీవితంలో సాధించిన విజయాలపై దీపిక తాజాగా స్పందిస్తూ... ఇప్పటికీ తాను చేయాల్సింది, నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని చెప్పింది. సినిమాల్లోకి వచ్చి తొమ్మిదేళ్లు అయిపోవడంతో తాను విశ్రాంతి తీసుకోవాలని అనుకోవడం లేదని పేర్కొంది. మంచి, చెడు ఏది జరిగినా తన సినీజీవితంలో వెనక్కి తిరగబోనని స్పష్టం చేసింది. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు దీపిక సినిమా ఒక్కటి కూడా రాలేదు. ఈ అంశం గురించి ఆమె స్పందిస్తూ.. ఆ విషయం గురించి తాను అంతగా బాధపడనని చెప్పింది. ఇప్పటివరకు తనకు నచ్చిందే తాను చేసినట్లు పేర్కొంది. జీవితంలో ఏది జరిగినా దాని వెనుక ఒక కారణం ఉంటుందని తాను భావిస్తానని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం తన కెరీర్లో వస్తున్న మార్పులకు కూడా అలాంటి కారణమే ఏదో ఉంటుందని తాను అనుకుంటున్నట్లు పేర్కొంది. 2013లో తనవి నాలుగు సినిమాలు విడుదలయ్యాయని గుర్తు చేసింది. వచ్చే ఏడాది తాను నటించిన రెండు సినిమాలు విడుదలవుతాయని చెప్పింది. ఆ సినిమాల్లో భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు పేర్కొంది. ఆ సినిమాలు తన కెరీర్లో మైలురాయిగా నిలిచిపోతాయని తాను అనుకుంటున్నట్లు చెప్పింది.