: అణుశక్తితో దాడులు చేయగల సబ్ మెరైన్, ఇతర సంపత్తిని ప్రదర్శించబోతున్న చైనా.. పలు దేశాల అభ్యంతరాలు
అణుశక్తితో దాడులు చేయగల భారీ జలాంతర్గామిని తాము ప్రదర్శించనున్నట్లు చైనా రక్షణ శాఖ పేర్కొంది. ఈ చర్యను ఇంతవరకూ ఏ దేశమూ చేపట్టలేదు. ఈ ప్రదర్శనతో చైనా తమ నౌకాదళ సామర్థ్యాన్ని తెలియజెప్పాలని భావిస్తోంది. ఈ యుద్ధనౌక స్వదేశీ పరిజ్ఞానంతో తయారయింది. త్వరలోనే చైనా కమ్యూనిస్ట్ పార్టీ కీలక ప్లీనరీ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా ఈ చర్యకు దిగడం గమనార్హం. స్వదేశీ పరిజ్ఞానంతో చేసిన సబ్ మెరైన్ తోపాటు ఇతర ఆయుధ సంపత్తిని కూడా తాము ప్రదర్శించబోతున్నట్లు చైనా అధికారులు చెప్పారు. ఈ ప్రదర్శన షాగ్డాంగ్ ఫ్రావిన్స్ లోని సింగ్టావో తీరంలోగల నేవీ మ్యూజియంలో జరగనుంది. తమ దేశీయుల్లో జాతీయవాద భావనను మరింత రెచ్చగొట్టడానికే చైనా ఈ ప్రదర్శను చేపడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ నాయకత్వంలో ఆ దేశం బలీయమైన శక్తిగా ఎదిగిందని అంటున్నారు. భవిష్యత్తులో తన పాటవాన్ని ఇంకా మెరుగుపర్చుకునే నేపథ్యంలోనే ఇటువంటి చర్యలు తీసుకుంటోందని చెబుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారమే జలాంతర్గామిలోని అణు పదార్థాలను తొలగించి ఈ యుద్ధనౌకను ప్రదర్శించనున్నట్లు చైనా పేర్కొంది. దీనిపై పలు దేశాలు అభ్యంతరాలు తెలుపుతున్నాయి.