: యూపీలో 'మహాఘటబంధన్'... చక్రం తిప్పుతున్న ప్రశాంత్ కిశోర్
ఉత్తరప్రదేశ్ లో తిరిగి అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నియమించుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, ఇప్పుడు సెక్యులర్ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే పనిలో నిమగ్నమై ఉన్నారు. వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా వివిధ పార్టీల కూటమిని 'మహాఘటబంధన్' పేరిట తయారు చేయాలన్నదే ఆయన లక్ష్యమని తెలుస్తోంది. సమాజ్ వాదీ పార్టీ నేత శివపాల్ యాదవ్, జేడీ (యూ)కు చెందిన కేసీ త్యాగీలతో ప్రశాంత్ సమావేశం కావడంతో 'మహాఘటబంధన్' వార్తలకు బలం చేకూరుతోంది. ములాయం సింగ్ ఆదేశాల మేరకు పొత్తు అవకాశాలను పరిశీలించేందుకు ఢిల్లీకి వచ్చిన శివపాల్ యాదవ్, కేసీ త్యాగితో సమావేశం తరువాత జేడీ (యూ) చీఫ్ శరద్ యాదవ్ తోనూ చర్చలు జరిపారు. ఆపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ సుప్రీమో లాలూప్రసాద్ యాదవ్, ఆర్ఎల్డీ నేత అజిత్ సింగ్ లతో టెలిఫోన్ సంభాషణలు జరిపినట్టు తెలుస్తోంది. దీంతో యూపీలో మహా కూటమి ఏర్పాటు దిశగా సమాజ్ వాదీ పార్టీ నడుస్తున్నట్టు స్పష్టమవుతుండగా, అన్ని పార్టీలనూ ఏకతాటిపైకి తెచ్చి విజయ తీరాలకు చేర్చే వ్యూహాల రూపకల్పన, వాటి అమలు బాధ్యత ప్రశాంత్ కిశోర్ తన భుజాలపై వేసుకున్నట్టు సమాచారం.