: దేవుడు చెప్పాడు... నేనిక ఎవరినీ దూషిస్తూ వ్యాఖ్య‌లు చేయ‌ను: ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు


వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచే ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జ‌పాన్ రాజ‌ధాని టోక్యోలో జరుగుతున్న ఆర్థిక సదస్సులో ఆయన మాట్లాడుతూ రెండేళ్లలో తమ దేశం నుంచి అమెరికా బ‌ల‌గాలు వెనక్కు వెళ్లిపోవాలని అన్న సంగతి తెలిసిందే. అనంతరం జపాన్ నుంచి పిలిప్పీన్స్ వస్తూ దవావో నగరంలో మాట్లాడుతూ, పలు వ్యాఖ్యలు చేశారు. తాను ప్రయాణించిన విమానంలో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఆకాశం వైపుకు చూసిన తనకు ఆ సమయంలో ఒక గొంతు వినపడిందని అన్నారు. తనను ఆకాశ‌వాణి హెచ్చ‌రించింద‌ని రోడ్రిగో డ్యుటెర్టె చెప్పారు. ఇక‌పై తాను అర్థం లేని వ్యాఖ్యలు చేయడం మానుకోకపోతే విమానాన్ని ఇప్పుడే కూల్చేస్తాననే మాటలు తనకు వినిపించాయ‌ని పేర్కొన్నారు. ఆ మాట‌లు విన‌ప‌డ‌గానే తాను మీరెవరు? అని ప్రశ్నించిన‌ట్లు చెప్పారు. దానికి త‌న‌కు దేవుడనే సమాధానం విన‌ప‌డింద‌ని అన్నారు. దీంతో తాను భ‌విష్య‌త్తులో ఎవరినీ దూషిస్తూ వ్యాఖ్య‌లు చేయ‌బోన‌ని ప్ర‌మాణం చేసి చెప్పారు. దేవుడికి ప్రమాణం చేస్తే త‌మ దేశ‌ ప్రజలందరికీ ప్రమాణం చేసినట్లేనని రోడ్రిగో డ్యుటెర్టె అన్నారు. ఇలా ఆయ‌న వ్యాఖ్య‌లు చేయ‌గానే ఆ ప్రదేశంలోని వారంతా చప్ప‌ట్లు కొట్టారు. అయితే, దీనిపై కూడా ఆయ‌న స్పందిస్తూ ఎక్కువగా చప్పట్లు కొట్టొద్దని సూచించారు. ఈ విష‌యాన్ని కూడా అంద‌రూ రాద్ధాంతం చేస్తారని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News