: చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆపరేషన్ ఆర్కేకు కారణమిదే: వరవరరావు
మైనింగ్ కంపెనీలతో కుదుర్చుకున్న ఎంవోయూలలో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం ఆపరేషన్ ఆర్కే కొనసాగిస్తోందని విరసం నేత వరవరరావు ఆరోపించారు. వాస్తవానికి ఇది ఆపరేషన్ ఆర్కే కాదని... ఆపరేషన్ మైనింగ్ అని అన్నారు. ఆధారాలు లేకుండా తాము ఎలాంటి ఆరోపణలు చేయమని చెప్పారు. లొంగిపోయిన ఓ దళ సభ్యుడు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ ఆపరేష్ జరిగిందని తెలిపారు. పేర్లు ఏవైనా సరే, చంపడమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం ఈ ఆపరేషన్ కొనసాగిస్తోందని విమర్శించారు. చనిపోయిన మావోయిస్టుల మృతదేహాల పోస్టుమార్టంలో కూడా స్పష్టత లేదని చెప్పారు. ఏవోబీలో జరిగింది బూటకపు ఎన్ కౌంటర్ అని... మావోయిస్టులను హత్య చేసి కథలు అల్లడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వరవరరావు తెలిపారు. అటవీసంపదను దోచుకోవడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ గ్రీన్ హంట్ కార్యక్రమాన్ని చేపట్టాయని మండిపడ్డారు. మల్కన్ గిరిలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఏకపక్షంగా కాల్పులు జరిగాయని ఆయన అన్నారు. పోలీసుల కాల్పుల్లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతే... మావోయిస్టుల కాల్పుల్లో పోలీసులకు కేవలం గాయాలు మాత్రమే అయ్యాయని చెప్పారు.