: తిరుమల కొండపై రెవెన్యూ భూమి ఉంటే పేకాట క్లబ్ కు అనుమతి ఇస్తారా?: ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విష్ణుకుమార్ రాజు


విశాఖపట్టణంలో ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ కు 15 ఎకరాల భూమి కేటాయించడం వివాదాస్పదమైంది. దీనిపై బీజేపీ ఎమ్యెల్యే విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఆయన నేరుగా ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానం విన్న ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుమల కొండలను ఆనుకుని ఎక్కడైనా రెవెన్యూ భూమి ఉంటే ఇలాంటి క్లబ్ కు అనుమతి ఇస్తారా? అని ఆయన నిలదీశారు. కాగా, విశాఖపట్టణం-భీమిలి బీచ్ రోడ్డులోని ప్రముఖ బౌద్ధారామం తొట్లకొండను ఆనుకుని ఉన్న 15 ఎకరాలను ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది. దీనిని రెవెన్యూ భూమిగా ప్రభుత్వం పేర్కోవడాన్ని ఆయన తప్పుపట్టారు. దీనిపై కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ను అడిగితే సరిగ్గా సమాధానం చెప్పడంలేదని ఆయన మండిపడ్డారు. దీని భూమి పూజకు కూడా ప్రజాప్రతినిధులను ఆహ్వానించలేదని, అలా ఆహ్వానిస్తే వారంతా దీనిని అడ్డుకునే ప్రమాదం ఉందన్న ఆలోచనతోనే అధికారులు తమను ఆహ్వానించలేదని ఆయన తెలిపారు. కాగా, బౌద్ధారామం పక్కనే మద్యపానం, పేకాటకు ఆస్కారమివ్వకూడదని ఆయన కోరారు. పవిత్ర స్థలంలో మద్యం తాగి, జూదం ఆడితే సంస్కృతిని కాలరాసినట్లేనని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. అక్కడ ఇచ్చిన స్థలాన్ని వెనక్కి తీసుకొని ఫిల్మ్‌ నగర్ కల్చరల్ క్లబ్‌ కు వేరే చోట స్థలం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మరోపక్క మంత్రి గంటా దీనిపై స్పందిస్తూ, దీనిని కలెక్టర్ పరిశీలిస్తున్నారని, బౌద్ధారామానికి సంబంధించినదైతే ముందడుగు వేయబోమని తెలిపారు.

  • Loading...

More Telugu News