: పవన్ ది ఉడుకు రక్తం.. ప్రత్యేకహోదా అవసరం లేదు: మాజీ మంత్రి సాయి ప్రతాప్
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ది ఉడుకు రక్తమని, ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదన్న విషయాన్ని ఆయన గుర్తించాలని కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్ అన్నారు. చిత్తూరు జిల్లా ములకల చెరువు మండలం అడవినాయన చెరువు సమీపంలో ఈరోజు జరిగిన టీడీపీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గురించి మాట్లాడాలంటూ ఈ సమావేశానికి హాజరైన పవన్ కల్యాణ్ అభిమానులు కోరారు. ఈ నేపథ్యంలోనే ఆయన పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని, ప్రత్యేక హోదా కావాలని నినదించడం సబబు కాదన్నారు. పవన్ సోదరుడు చిరంజీవి పార్టీ పెడితే ఏమైందో అందరికీ తెలిసిన విషయమేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.