: ములాయం ఇంట్లో పుట్టిన ముసలం ఎలా మాయమైందో తెలుసా?


సమాజ్ వాదీ పార్టీలో పుట్టిన ముసలం టీకప్పులో తుపానులా చల్లబడిపోయిన సంగతి తెలిసిందే. వర్గాలుగా మారిపోయిన కుటుంబ సభ్యులు ఇటీవల తీవ్ర నిర్ణయాలతో కలకలం రేపారు. బాబాయ్ ని పదవి నుంచి పీకేస్తే... తండ్రి కొడుకు పదవిని ఊడగొట్టారు. దీంతో విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇలా జాతీయ స్థాయిలో సమాజ్ వాదీ పార్టీ అధినేత నివాసం వారం రోజుల పాటు తీవ్ర ఉత్కంఠ రేపింది. ఇంత వివాదం ఒక్కరోజులో సమసిపోయింది. ఎలా? పరిస్థితులన్నీ మారిపోవడం వెనుక ఎవరున్నారు? అంటే ములాయం సింగ్ యాదవ్ స్వగ్రామం సైపై ప్రధాన్ దర్శన్ సింగ్ యాదవ్ పేరు చెబుతున్నారు. దర్శన్ సింగ్ యాదవ్ ఇటావా జిల్లా సైఫై గ్రామ ప్రధాన్. ములాయం రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో ఆ గ్రామంలోని దళితుడిచ్చిన మంచి నీళ్లు తాగారు. దీంతో గ్రామస్థులంతా ఆచారం మంటగలిపాడంటూ ములాయంను కొట్టేందుకు ముందుకు వచ్చారు. ఆ సమయంలో ములాయం వండిన బంగాళాదుంప తిన్న దర్శన్ సింగ్ యాదవ్... ములాయం అమంగళమైతే ఆయన వండిన కూర తిన్న తాను కూడా అపవిత్రుడినైనట్టేనని, అతని కంటే ముందు తనను శిక్షించాలంటూ గ్రామస్థులకు ఎదురెళ్లారు. దీంతో గ్రామస్థులు మౌనం వహించారు. అప్పటి నుంచి సైపై గ్రామానికి ఆయనే ప్రధాన్, ఆయన మాటంటే నేతాజీ (ములాయం)కి వేదవాక్కు. దీంతో తమ్ముడు, కుమారుడితో కలిసి ఆయన సైపై గ్రామానికి వెళ్లారు. ప్రధాన్ దర్శన్ సింగ్ యాదవ్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీలో మీరే కలహించుకుంటే ప్రజలు, కార్యకర్తల్లోకి ఏ సందేశం వెళ్తుందని ప్రశ్నించారు. అలాగే ఒకరి నిర్ణయాలు ఒకరు గౌరవించుకుని ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన ములాయం కుటుంబ సభ్యులు ఎవరి పనిలో వారు మునిగిపోయారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా ములాయం తమ్ముడు ఢిల్లీ వెళ్లగా, రాష్ట్ర వ్యాప్తంగా భారీ ర్యాలీ నిర్వహించేందుకు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సిద్ధమవుతున్నారు. పార్టీ వ్యవహారాల్లో ములాయం సింగ్ యాదవ్ తలమునకలైపోయారు. దీంతో ఆయన నివాసంలో పుట్టిన ముసలం టీకప్పులో తుపానులా ముగిసిపోయింది.

  • Loading...

More Telugu News