: వాస్తు బాగోలేదని, పాతబడిందని చార్మినార్ను కూడా కూల్చేస్తారా?: తెలంగాణ సర్కారుపై షబ్బీర్ అలీ విమర్శలు
తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఆందోళన చేపట్టింది. 'విద్యార్థి పోరు గర్జన' పేరుతో కొనసాగుతున్న ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తీరుపై నిప్పులు చెరిగారు. విద్యార్థులను కేసీఆర్ శత్రువులుగా చూస్తున్నారని ఆయన అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో రెండేళ్లుగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరితో కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చిందని షబ్బీర్ అలీ అన్నారు. కొత్త సచివాలయ నిర్మాణానికి ఎంతో ఖర్చు పెడుతున్న సర్కారు ఫీజు రీయింబర్స్ మెంట్కు డబ్బులు లేవని చెప్పడం ఏంటని దుయ్యబట్టారు. సచివాలయ భవనాల కూల్చివేతపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. వాస్తు బాగోలేదని, పాతబడిందని చార్మినార్ను కూడా కూల్చేస్తారా? అని సర్కారుని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఆ మాటను మరచి, తనకు సౌకర్యవంతమైన ఇళ్ల నిర్మాణం చేయించుకుంటున్నారని షబ్బీర్ అలీ అన్నారు. డబుల్ బెడ్ రూంలు కట్టిచ్చిన తరువాతే కేసీఆర్ అధికార నివాసంలోకి వెళ్లాలని ఆయన వ్యాఖ్యానించారు. ఫిరాయింపులపై మాట్లాడిన ఆయన.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ పాటించాలని డిమాండ్ చేశారు. సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర పాలనపై తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి ఉందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలకు నిధులు విడుదల చేయలేదని, అందుకే తాము ఆందోళనకు దిగవలసి వచ్చిందని అన్నారు. ప్రభుత్వం దిగివచ్చేవరకు తమ పోరుని ఆపబోమని చెప్పారు.