: పాలు వద్దు... బీరు తాగండి... మీ ఆరోగ్యానికి చాలా మంచిది: పెటా


మీరు చదివింది నిజమే. పాలు తాగడం వల్ల ఉపయోగం ఏమీ లేదని... బీరు తాగడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని 'పెటా' (జంతు సంరక్షణ సంస్థ) ప్రకటించింది. అంతేకాదు, అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్శిటీ మాడిసన్ క్యాంపస్ కు దగ్గర్లో 'గాట్ బీర్' పేరుతో ఓ బిల్ బోర్డును కూడా ఏర్పాటు చేసింది. పాలు తాగడం కంటే బీరు తాగడమే ఆరోగ్యానికి మంచిదనే విషయం సైంటిఫిక్ గా ప్రూవ్ అయిందని బిల్ బోర్డుపై పేర్కొంది. పాలకన్నా బీరు బలవర్ధకమైనదని, ఎముకల పటుత్వాన్ని పెంచడమే కాకుండా ఆయుష్షును కూడా పెంచుతుందని తెలిపింది. పాల ఉత్పత్తులను వాడటం ద్వారా ఎముకలు గుల్లబారే ప్రమాదం ఉందని పెటా వెల్లడించింది. అంతేకాదు, పాలు సేవించడం వల్ల డయాబెటిస్, ఒబేసిటీ, కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందట. ఈ నేపథ్యంలో, 'ఇట్ ఈజ్ అఫీషియల్' అంటూ బీరుకు ప్రచారం చేసింది పెటా. 2000 సంవత్సరంలో కూడా బీరుకు అనుకూలంగా పెటా ప్రచారం చేసింది. అయితే, పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో అప్పట్లో వెనక్కి తగ్గింది. పాల కోసం లక్షలాది ఆవులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని... పాల వినియోగం తగ్గితే, వాటిని హింసించడం కూడా తగ్గుతుందనే ఉద్దేశంతో బీర్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్నామని తెలిపింది. ఆల్కహాల్ మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి కూడా మంచిదేనని పెటా ఉపాధ్యక్షుడు ట్రేసీ రీమన్ చెప్పారు.

  • Loading...

More Telugu News